🍁నేటి కథ
🍥 తప్పెవరిది?
ఒక అడవిలో జంతువులన్నీ ఐకమత్యంగా ఉండేవి. తల్లిదండ్రులు ఆహారం కోసం వెళ్లినప్పుడు పిల్లలన్నీ కలిసి ఓ దగ్గర చేరి ఆటలాడేవి. సింహపు పిల్లతో జింక పిల్ల, ఏనుగు పిల్లతో ఎలుక పిల్ల, ఎలుగుబంటితో కోతిపిల్లా కబుర్లు చెప్పుకుంటూ గడిపేవి.
ఒక రోజు కోతి పిల్ల ‘ఆటలు ఆడగా ఆడగా విసుగొస్తోంది. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, కథలు చెప్పడంలాంటి కొత్త ఆటలు నేర్చుకుందామా?’ అని అడిగింది. మిగతావి సరేనన్నాయి. అప్పటి నుంచి కొత్త ఆటలు ఆడటం ప్రారంభించాయి.
పిల్ల జంతువుల కొత్త ఆటల్ని ఒకసారి మృగరాజు చూసింది. వాళ్లకి పద్ధతి ప్రకారం విద్య నేర్పితే తెలివితేటలు పెరుగుతాయని అనుకుంది. వెంటనే ముసలి నక్కను పిలిచి గురువుగా బాధ్యత తీసుకుని విద్యలు నేర్పమంది.
సింహం పిల్లకి గురువు మాటలు లెక్కలేదు. గురువు చెప్పే విద్యలు ఎప్పుడూ వినిపించుకోలేదు. సింహంకూన సంగతి మృగరాజుకి చేరితే విద్య చెప్పడం చేతకాదని తననెక్కడ చంపేస్తుందోనని భయపడింది నక్క. ఆ ప్రమాదం రాకుండా మృగరాజును కలుస్తూ ‘మీ కొడుకు మహా తెలివైనవాడు. అన్ని విద్యల్లో అతడే మేటి’ అనేది. కొన్నాళ్లు గడిచింది.
తమకు మంచి జరగాలని అడవి తల్లి సంబరం చేయాలని జంతువులనుకున్నాయి. చుట్టాలకు, స్నేహితులకు కబుర్లు పెట్టాయి. సంబరాల రోజున తమ పిల్లలకు ప్రతిభా పోటీలు పెట్టి బహుమతులు పంచాలని మృగరాజుకు కోరిక కలిగింది. కొడుకు గొప్పదనం పక్క అడవుల్లో వాళ్లకు కూడా తెలుస్తుందని ఆశపడింది.
సంబరాలకు వచ్చిన సింహాన్ని ముఖ్య అతిథిగా, పులిని న్యాయ నిర్ణేతగా ఉండాలని కోరింది మృగరాజు. పిల్లలకు అనేక పోటీలు జరగగా, సింహపు కూన కనీస ప్రతిభను చూపలేకపోయింది. కుందేలు పిల్ల మొదటి బహుమతి, గుర్రం పిల్ల రెండో బహుమతి గెలుచుకున్నాయి. వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుని బహుమతులిప్పించింది మృగరాజు.
‘మొదటి బహుమతి అందుకున్న పిల్ల కుందేలు మాట్లాడుతూ ‘బడిలో నా ప్రతిభను గుర్తించకుండా మృగరాజు పిల్లను ఎప్పుడూ పొగుడుతుండేది నక్క. నాలో పంతం పెరిగి కోయిల దగ్గర పాటలు, చిలక దగ్గర బొమ్మలు, మైనా దగ్గర కథలు, గుర్రం దగ్గర కొత్త ఆటలు నేర్చుకున్నాను. అమ్మా నాన్నల వద్ద సాధన చేస్తూ తప్పులు సరిదిద్దుకున్నాను. అందుకే బహుమతి పొందాను’ అంది.
జంతువులన్నీ అరుపులతో పిల్ల కుందేలుని మెచ్చుకున్నాయి. అందరి ముందూ గర్వంగా తలెత్తుకోవాలన్న తన ఆలోచన బెడిసికొట్టినందుకు అవమానంగా భావించింది మృగరాజు. తప్పుడు మాటలు చెప్పి పరువు పోవడానికి కారణమైన నక్క కోసం చూసింది. ప్రాణభయంతో అప్పటికే అడవి విడిచి పారిపోయింది నక్క.
‘నక్క చెప్పిన మాటలు నమ్మడమేగానీ కొడుకుని పరీక్షించకపోవడం తన తప్పేనని, పిల్లల విద్యల్ని తల్లిదండ్రులు అప్పుడప్పుడూ పరీక్షించి తెలుసుకోవాలని’ అనుకుంది సింహం.

No comments:
Post a Comment